S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.ఆర్టీసీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోలు, వర్క్‌షాప్‌ల వద్ద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని వివిధ యూనియన్ల నేతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

వరదలకు ఉత్తరాదిలో 60 మంది మృతి

దిల్లీ: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జన జీవనం అతలాకుతలమవుతోంది. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వరద తాకిడి సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, యుపి, బిహార్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థల పాలయ్యారు. అస్సాం, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. కొన్ని చోట్ల రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

కుమార్తె సహా తల్లి ఆత్మహత్య

ఏలూరు: తాగుడుకు బానిసైన భర్త నిత్యం నరకయాతన పెడుతున్నందున విసుగెత్తిన ఓ ఇల్లాలు తన నాలుగేళ్ల కుమార్తె చేత పురుగుమందు తాగించి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ముదునూరులో మంగళవారం ఉదయం ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. భర్త దుర్గాప్రసాద్ పెడుతున్న చిత్రహింసలను భరించలేక అశ్విని తన కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పురుగుమందు తాగిన కొద్దిసేపటికే కుమార్తె మరణించగా, ఆస్పత్రికి తరలించిన తర్వాత అశ్విని మృతిచెందింది. పరారైన భర్త దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

డికె అరుణ పాదయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్: గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. గద్వాలలోని జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె తన పాదయాత్రను ప్రారంభించారు. ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయం వరకూ ఆమె పాదయాత్ర సాగుతుంది. ఈ ప్రాంత ప్రజల మనోభీష్టం మేరకు గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆమె ప్రకటించారు.

దిగ్విజయ్‌తో కెవిపి, రఘువీరా చర్చలు

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కెవిపి రామచంద్రరావు మంగళవారం ఇక్కడ కలిశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై కెవిపి ఈ సందర్భంగా దిగ్విజయ్‌కు వివిరించారు. ఈ బిల్లు ఆమోదానికి వివిధ పార్టీల సహకారం తీసుకునే విషయమై ఆయన దిగ్విజయ్ నుంచి సలహాలు తీసుకున్నారు. ఇతర పార్టీల వారిని కూడా కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాలని కెవిపి విజ్ఞప్తి చేస్తున్నారు.

వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు

హైదరాబాద్: గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్టల్రోని షిర్డీతో పాటు తెలుగురాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో షిర్డీ సాయి ఆలయం వద్ద తెల్లవారు జాము నుంచే కోలాహలం నెలకొంది. ఇక, హైదరాబాద్‌లోని పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఎపిలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాయినాథుడి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

అల్పపీడన ద్రోణితో వర్షం

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఆల్పపీడన ద్రోణి ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పలు చోట్ల వానలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జంట నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో 3, 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు.

రెండో రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి మృతులకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్‌సభలో టీడీపీ నోటీస్‌ ఇచ్చింది. భారత వైద్య మండలి చట్టసవరణ బిల్లు, దంత వైద్యులచట్ట సవరణ బిల్లుపై లోక్‌సభ‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భద్రాద్రిలో దమ్మక్క ఉత్సవాలు

ఖమ్మం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దమ్మక్క ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు దమ్మక్క చిత్రపటానికి పూల మాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు. పండ్లతో గిరిజనులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

ఇద్దరు స్పైస్‌జెట్‌ ఉద్యోగులు అరెస్టు

మంగళూరు: బంగారంస్మగ్లర్లకు సాయం చేస్తున్న ఇద్దరు స్పైస్‌జెట్‌ ఉద్యోగులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ విమానంలో సీటు కింద దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించారు. స్మగ్లర్లకు సాయం చేస్తున్న మంగళూరు ఎయిర్‌పోర్టులో పనిచేసే మహ్మద్‌ హనీఫ్‌, ముద్దయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది. గతంలో ఆరు సార్లు కూడా ఇలా స్మగ్లర్లకు సాయం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి 2.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు, బంగారం విలువ రూ.75.26లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Pages