S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్‌తో కెసిఆర్ మంతనాలు

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణలో న్యాయవాదులు ఆందోళన, న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు, హైకోర్టు విభజన, తాజా పరిణామాలపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. లాయర్ల ఆందోళనపై గవర్నర్ శుక్రవారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు కొంతమంది ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ వివరాలను ఆయన సిఎంకు తెలిపినట్లు భోగట్టా.

అనర్హతపై వైకాపా అర్జీని తిరస్కరించిన స్పీకర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఇచ్చిన పిటిషన్‌ను ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం తిరస్కరించారు. టిడిపిలో చేరిన 13 మందిని అనర్హులుగా ప్రకటించాలని గతంలో వైకాపా స్పీకర్‌కు అర్జీని సమర్పించింది. అయితే, పలు సాంకేతిక లోపాల వల్ల ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు.

మిషన్ కాకతీయకు రూ. 5వేల కోట్లు ఇవ్వండి

హైదరాబాద్: తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి 5వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శనివారం లేఖ రాశరు. జలవనరులను పెంచేందుకు మిషన్ కాకతీయ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పథకానికి నిధుల కోసం నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసిందన్నారు. వెనుకబడిన తెలంగాణ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.

భైంసాలో యువతి దారుణ హత్య

ఆదిలాబాద్: భైంసా పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు నడిరోడ్డుపై యువతిని దారుణంగా హతమార్చాడు. తనను ప్రేమించలేదన్న కక్షతో మహేష్ అనే యువకుడు స్థానిక గోవిందనగర్‌కు చెందిన సంధ్య (16)పై కిరాతకంగా కత్తితో గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పరారైన మహేష్ కోసం గాలిస్తున్నట్టు స్థానిక డిఎస్పీ తెలిపారు.

మాజీ మంత్రి నాగంపై దాడికి యత్నం

మహబూబ్‌నగర్: బిజెపి నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకువచ్చి నిరసనకు దిగారు. ఆయనపై దాడి చేసేందుకు వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బిజెపి, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, తాను తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్టు తెరాస కార్యకర్తలు చేస్తున్న వాదనలో నిజం లేదని నాగం అన్నారు. ప్రాజెక్టుల్లో అక్రమాలను అరికట్టాలన్నదే తన డిమాండ్ అని చెప్పారు.

డిండి ఎత్తిపోతలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం డిండి ఎత్తిపోతల పథకంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆస్తి తగాదాలతో భర్తను చంపిన భార్య!

ఘజియాబాద్‌ ( ఉత్తరప్రదేశ్‌): ఆస్తి తగాదాలతో భార్యే భర్తను చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తండ్రి జితేంద్ర సింగ్‌ తోమర్‌ జూన్‌ 26 నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కుమారుడు అమిత్‌, కారు డ్రైవర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నించారు. తల్లి, కారు డ్రైవర్‌లతో కలిసి తండ్రిని హత్య చేసినట్లు అమిత్‌ అంగీకరించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. కుమారుడిని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, జితేంద్ర భార్య కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

గుంటూరు: ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు.

‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేషుడు

హైదరాబాద్‌: ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణేషుడు ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణేశుడి కుడి చేతివైపు వెంకటేశ్వరస్వామి, ఎడమవైపు శ్రీకృష్ణుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు.

ముంబయిలో సబర్బన్‌ రైలు సర్వీసులు ఆలస్యం

ముంబయి: ముంబయి నగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. సబర్బన్‌ రైలు సర్వీసులు అన్నీ 15నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వచ్చే 24గంటల్లో ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముంబయితో పాటు మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొలాబాలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం, శాంతాక్రజ్‌లో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Pages