S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం

విశాఖపట్నం, జూలై 2: దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు. ఇక్కడి సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై ప్రేమ పేరుతో దాడులు ఎక్కువ అవుతున్నాయని, నేరస్తులకు కొంతమంది అధికార పార్టీ నేతలం కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో కూడా మహిళలకు న్యాయం జరుగడం లేదన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ప్రసార మాధ్యమాల్లో మహిళలను అంగడివస్తువుగా చూపిస్తుండటంతో దాడులు ఎక్కువ అవుతున్నాయన్నారు.

త్వరలో హెల్త్‌సిటీని ప్రారంభించాలి

విశాఖపట్నం, జూలై 2: ముడసర్లోవ రహదారిలో చేపట్టిన హెల్త్‌సిటీలో ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని హెల్త్‌సిటీ యజమానులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే నెల మార్చి నాటికి పూర్తికాని ప్రాజెక్టులకు కేటాయించిన స్థలాలను వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్త్‌సిటీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.8 కోట్లు ఎపిఐఐసి ద్వారా ఖర్చు చేయనున్నట్టు సిఎం హామీ ఇచ్చారు. హెల్త్‌సిటీలో ఆసుపత్రుల నిర్మాణానికి స్థలాలు పొందిన వారంతా తమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే విశాఖ ఒక హెల్త్ హబ్‌గా రూపొందుతుందన్నారు.

మీరు స్మార్టైతేనే మీ సిటీ స్మార్ట్

విశాఖపట్నం, జూలై 2: మీరు స్మార్ట్‌గా ఉంటేనే మీ సిటీ స్మార్ట్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్‌కె బీచ్ వద్ద వైజాగ్ స్టీల్ నైట్ బే మారథాన్ పోటీలను శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అమెరికా సహకారంతో విశాఖ నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుందని, స్మార్ట్‌సిటీ ప్రజానీకం అంతే స్మార్ట్‌గా ఉండాలన్నారు. కష్ట,నష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచే తత్వం ఉన్న విశాఖ అంటే తనకెంతో ఇష్టమని, విశాఖను అన్ని రంగాల్లోను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన తొలి ప్రాధాన్యమని అన్నారు. హుదూద్ తుపాను పెను విషాదాన్ని మిగిల్చినప్పటికీ నగర ప్రజలు ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదన్నారు.

సిద్ధాంతాల ముసుగులో మావోయిస్టుల అక్రమ దందా

విశాఖపట్నం(క్రైం), జూలై 2: సిద్ధాంతాల ముసుగులో మావోయిస్టు నేతలు డబ్బులు వసూలు చేసే గూండాలుగా వ్యవహరిస్తున్నారని నర్సీపట్నం అదనపు ఎస్‌పి ఐశ్వర్య రస్తోగి మండి పడ్డారు. ఇటీవల కాలంలో గిరిజన యువతి, యువకుల పట్ల దళంలో ఉన్న మావోయిస్టు అగ్ర నాయకులు చూపుతున్న వివక్షకు బాధపడి సుమారు పది మంది మహిళా మావోయిస్టులు స్వచ్ఛంధంగా లొంగపోవడం జరిగిందని శనివారం ఆయన పంపిన ప్రకటనలో తెలిపారు.

నారాయణ తిరుమలలో అష్టోత్తర నామావళి

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: నగరంలో గుజరాతీపేటలో ఉన్న నారాయణ తిరుమల ఆలయంలో శనివారం అష్టోత్తర నామావలి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నారు. అర్చకులు జి.శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా దూదివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రేజేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు పూజలు నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాదరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు బాలమురళీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. ఆలయ ధర్మకర్త బెహరా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు.

పేద కళాకారులకు రంగస్థలం పెద్ద వరం

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: శ్రీకాకుళం రంగస్థలం కళాకారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కళాకారులకు పింఛన్లు అందించడం మంచి సేవా కార్యక్రమంగా చేస్తున్నారని విశ్రాంతి సి ఇవో సురంగి మోహనరావు అన్నారు. శనివారం స్థానిక బాపూజీకళామందిర్‌లో శ్రీకాకుళం రంగ స్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో 201వ నెల సంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్యను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టరేట్ పొందిన ప్రముఖ నృత్య కళాకారుడు రఘుపాత్రుని శ్రీకాంత్ సమాఖ్య సన్మానించింది.

రక్తదానం మరొకరికి ప్రాణదానం

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. శనివారం పెద్దపాడు రోడ్డులోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తంలేక మరణాలే సంభవించకుడదని రక్తదానాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. జిల్లాలో రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావడం హర్షించదగ్గవిషయమన్నారు. స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మేరీసగయ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారన్నారు.

దేవాలయాల విద్వంసం దారుణం

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: పుష్కరాల నెపంతో విజయవాడ నగరంలో వందల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన 45 హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణకు అవసరమైతే దేవాలయాలను వేరొక ప్రదేశానికి మార్చి సంప్రదాయ పద్దతిలో దేవతావిగ్రహాలను తీయాలే తప్ప యంత్రాలతో దేవతా విగ్రహాలను దారుణంగా విద్వంసం చేయడం ఆనాడు మొగలును పరిపాలనను గుర్తు చేస్తుందని ఈ విధంగా కూల్చడం హిందూ ధర్మాన్ని, సమాజాన్ని అవమాన పరచడమే అని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గుంపా శివప్రసాద్ తెలియజేశారు.

అధికారుల తీరుపై తమ్మినేని ఆగ్రహం

శ్రీకాకుళం(టౌన్), జూలై 2: జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందజేస్తున్న పింఛను బట్వాడాలో ఎంపిడివోలు జిల్లా కలెక్టర్‌ను సైతం మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ రాష్ట్ర సభ్యులు తమ్మినేని సీతారాం విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక జిల్లా వ్యాప్తంగా సుమారు 64వేల పింఛన్లు తొలగించారన్నారు.

Pages