S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ పెరిగిన బంగారం ధర

దిల్లీ: అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.57శాతం పెరిగి 1,298.10 యూఎస్‌ డాలర్లకు చేరింది. తగ్గిందనుకున్న పసిడి ధర శనివారం రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,800కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

కార్యకర్తలూ.. నిరాశపడొద్దు: ఉత్తమ్

హైదరాబాద్: వ్యక్తిగత స్వార్థంతో కొంతమంది నాయకులు ఫిరాయింపులకు పాల్పడుతున్నా పార్టీ కార్యకర్తలు నిరాశపడరాదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని, అంతవరకూ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.

ప్రియాంక ఇంటి నిర్మాణంపై రాజుకున్న వివాదం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక నిర్మిస్తున్న ఇంటిపై వివాదాలు ముసురుకుంటున్నాయి. రాష్టప్రతి వేసవి విడిదికి సమీపంలో ప్రియాంక ఇంటి నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని బిజెపి ఎమ్మెల్యే సురేష్ భరద్వాజ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాష్టప్రతి విడిది ఉన్నందున ఆ ప్రాంతం హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై భరద్వాజ్ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ డిజిపికి, హోం శాఖ అధికారులకు లేఖలు రాశారు. ఆ ఇంటి నిర్మాణాన్ని ఇటీవల సోనియా, ప్రియాంక స్వయంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

అధిక ఫీజులపై ఎబివిపి నిరసన

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ ఎబివిపి కార్యకర్తలు శనివారం నాడు నగరంలోని పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నాయని, ఫీజులను నియంత్రించకుంటే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కమిషనర్ కార్యాలయంలోనికి దూసుకుపోయేందుకు ప్రయత్నించిన కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

22న ఎపి సెట్ నోటిఫికేషన్ విడుదల

విశాఖ: పిజి విద్యార్థులకు ‘స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (సెట్)ను ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని, ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వీసీ ఫ్రొఫెసర్ నారాయణ శనివారం తెలిపారు. మొత్తం 31 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో సెప్టెంబర్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

విజయశాంతి ఇంట్లో పనిమనిషే నగలు కాజేసింది..

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఉంటున్న సినీ నటి విజయశాంతి ఇంట్లో బంగారు నగలు కాజేసింది పనిమనిషేనని పోలీసుల విచారణలో తేలింది. విజయశాంతి ఇంట్లో గాజులు, వజ్రాలు పొదిగిన చెవిదుద్దులు, ఉంగరం అయిదురోజుల క్రితం మాయమయ్యాయి. ఈ విషయమై విజయశాంతి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి ‘ఇంటిదొంగ’ను కనిపెట్టారు.

ఏటిగెడ్డ కృష్ణాపూర్‌లో రైతుల ఆందోళన

మెదక్: బలవంతపు భూసేకరణకు కొందరు నాయకులు సహకరిస్తున్నారంటూ మెదక్ జిల్లా ఏడిగెడ్డ కృష్ణాపూర్‌లో రైతులు శనివారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక ఎంపిటిసి సభ్యుడు ప్రతాపరెడ్డికి చెందిన వ్యవసాయ పనిముట్లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రామ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

మల్లన్నసాగర్‌పై నివేదికకు సర్కారు ఆదేశం

హైదరాబాద్: సింగూరు వరకూ కొమురెల్లి మల్లన్నసాగర్ జలాశయం నీటిని తరలించేందుకు నివేదికను సిద్ధం చేయాలని తెలంగాణ సర్కారు శనివారం అధికారులను ఆదేశించింది. మల్లన్నసాగర్ జలాశయాన్ని నిర్మించాలని తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు, తెరాస కార్యకర్తలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మోహన్‌బాబు కోడలికి గాయాలు

హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీనటుడు మోహన్‌బాబు పెద్ద కోడలు (మంచు విష్ణు భార్య) వెరోనిక స్వల్పంగా గాయపడ్డారు. మామిడిపల్లి నుంచి వస్తున్న కారు, వెరోనిక ప్రయాణిస్తున్న కారు పరస్పరం ఢీకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మోహన్‌బాబు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

‘అమరావతి’ సూపర్‌ఫాస్ట్ రైలు 20న ప్రారంభం

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20న రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారు. ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ కొత్త రైలును ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 22 నుంచి ఈ రైలు వారానికి ఆరుసార్లు (ఆదివారం తప్ప) నడుస్తుంది. ఈ రైలు ఉదయం 5-30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 5-30 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు రాత్రి 11-10 గంటలకు చేరుకుంటుంది.

Pages