S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధికే పెద్దపీట

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని రాజుతండా నుంచి ఒంటిగూడిసెతండా వరకు 130లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రోడ్డును త్వరిగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యవంతంగా చూడాలన్నారు.

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం కావాలి

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 23: బాధితులకు సరైన న్యాయం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ రేంజ్ డిఐజి సి రవివర్మ పేర్కొన్నారు. డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం నగరానికి మొదటిసారిగా రావడంతో ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా స్పెషల్‌బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతయుతమైన విధులు ఏ విధంగా నిర్వహించాలో పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐలకు తెలియజేయాలన్నారు.

నేడు మార్కెట్ యార్డుకు సెలవు

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 23: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ఇస్తున్నట్లు పర్సన్ ఇన్‌చార్జ్ శ్యాముల్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సరుకును యార్డుకు తరలించే సమయంలో తడచి ఆగమవుతాయనే ఉద్దేశ్యంతో యార్డుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు మార్కెట్‌లో విక్రయాలకు సరుకులు తీసుకరావద్దన్నారు.

12 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్ నీటిమట్టం

వైరా, సెప్టెంబర్ 23: గత రెండురోజులుగా కురుస్తున్న చెదురు, మదురు వర్షాలతో స్థానిక రిజర్వాయర్ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 12అడుగులకు చేరుకుంది. గత జూన్ నెల నుండి కురుస్తున్న వర్షాలకు కేవలం మూడడుగులు మాత్రమే ఇప్పటి వరకు రిజర్వాయర్‌లోకి చేరుకుంది. రిజర్వాయర్‌పై భాగంలోని ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి, కారేపల్లి, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 12అడుగులకు చేరుకున్న నీటిమట్టంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంగా ఇంకా రెండు, మూడురోజుల పాటు వర్షాలు కురిస్తే నీటిమట్టం బాగానే పెరిగే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ ఎఇ రాణి తెలిపారు.

పంపకాలిలా..

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: ఖమ్మం జిల్లా పంచాయతీ వ్యవస్థను అధికారులు ఎట్టకేలకు లెక్క తేల్చారు. ఖమ్మం జిల్లా ఉమ్మడిగా ఉన్న సమయంలో41మండలాలు ఉండగా, కొత్తగూడెం నూతన జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 21మండలాలు, కొత్తగూడెం జిల్లాలోకి 18మండలాలు ఉండేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా పరిధిలో 21మండలాల్లో 439గ్రామపంచాయతీలు, కొత్తగూడెం జిల్లాలో 18మండలాలు ఉండనుండగా 211 గ్రామ పంచాయతీలుగా ఉండనున్నాయి. ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, వైరా రెవెన్యూ డివిజన్లుగా, కొత్తగూడెం జిల్లా పరిధిలో కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి.

వర్ష బీభత్సం

నల్లగొండ, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాను అల్పపీడన వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా, వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడా అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండగా సగటు 89.4మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. గురువారం రాత్రి నుండి మొదలుకుని శుక్రవారం రాత్రి వరకు కూడా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు నిరంతరాయంగా ఎడతెరపిలేకుండా కురుస్తుండగా జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లా పరిధిలోని మూసీ నది ఉప్పొంగగా, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి.

మూసీకి వరద ఉదృతి

కేతేపల్లి, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల వల్ల అధికస్థాయిలో వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను శుక్రవారం 8అడుగుల మేర ఎత్తులేపి 41వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. తొలుత ఐదు గేట్లను 5 అడుగుల మేర ఎత్తగా నీటి ప్రవాహాం అధికమవ్వడంతో మధ్యాహ్నానానికి 8గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి 30,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

శేశిలేటివాగులో పడి విద్యార్థి గల్లంతు

నాంపల్లి, సెప్టెంబర్ 23: వర్షం గత మూడు రోజుల నుంచి విపరీతంగా కురుస్తుండటంతో గ్రామంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తమై బడులకు సెలవు ప్రకటించడంతో మొదటి రోజే మండంలోని గానుగుపల్లి గ్రామానికి చెందిన మానాల సాయికుమార్(14) శుక్రవారం శేశిలేటివాగు నుండి వచ్చే వరదనీరు గానుగుపల్లిలో విపరీతంగా పారుతుండటంతో విద్యార్ధి అందులో పడి గల్లంతయ్యాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు, అదికారులు అప్రమత్తమై విద్యార్ధి మృతదేహానికై గాలిస్తున్నారు.

గోడ కూలి వద్ధురాలు మృతి

మోత్కూరు, సెప్టెంబర్ 23: మండలంలోని ఫొడ్డుగూడెం గ్రామానికి చెందిన సప్పిడి మణెమ్మ (85) గురువారం రాత్రి ఇంటి గోడ కూలి మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజువారి మాదిరిగా భోజనం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాని ఇంటి గోడలు నాని ఆమె మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిది. ఆమె కొడుకు ఉన్నప్పటికి ఒంటరిగానే ఉంటుందని తెలిపారు.

వర్ష బాధితులకు ప్రభుత్వ సహాయం

నల్లగొండ, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో వర్షాలు, వరదల తాకిడికి గురైన ప్రాంతాలను ఆయన సందర్శించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలో ఇప్పటిదాకా వర్షాలు, వరదలతో ఇల్లుకూలి ఒకరు, వరదలో కొట్టుకపోయి ముగ్గురు చనిపోయారన్నారు. వారి కుటుంబాలకు 4లక్షల చొప్పున రూపాయల ఆర్ధిక సహాయ అందిస్తామని ప్రకటించారు.

Pages