S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాంతం ఒకటే కుల ధ్రువీకరణ పత్రం

విజయవాడ, జనవరి 18: ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాలకు సంబంధించి జీవితాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన ధ్రువపత్రం జీవితాంతం ఉపయోగపడేలా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా నిర్ణయం తీసుకున్నారు. వెలగపూడి సచివాలయంలో 5వ బ్లాక్‌లోని కలెక్టర్ల కాన్ఫరెన్సు హాల్‌లో శుక్రవారం జరిగిన కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ధ్రువపత్రాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు.

రెచ్చిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

చింతూరు, జనవరి 18: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టు మిలీషియా సభ్యులు రెచ్చిపోయారు. వారపు సంతకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యాపారులను చితకబాది, వారికి చెందిన టాటా ఏస్ వాహనాన్ని దగ్ధంచేశారు. చింతూరు మండలం పేగ గ్రామంలో పట్టపగలే ఈ ఘాతుకం చోటుచేసుంది. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యాపారులు శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో జరిగే వారపు సంతకు వచ్చారు. పేగ గ్రామంలోని బస్టాండు ప్రాంగణంలో దుకాణం పెట్టి ప్రజల నుంచి అపరాలు, అటవీ ఉత్పత్తులను కొనుగోలుచేస్తున్నారు.

తెలుగువారి గుండెల్లో కొలువైన ఎన్‌టీఆర్

గుంటూరు, జనవరి 18: తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన యుగపురుషుడు దివంగత నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ శ్లాఘించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం, అన్నదానం, వైద్య శిబిరం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రక్తదానం చేసి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సర్ట్ఫికెట్లు అందుకున్నారు.

ఏసీబీ వలలో దేవరపల్లి ఏఎస్సై

దేవరపల్లి, జనవరి 18: వ్యక్తిగత ఘర్షణకు సంబంధించిన కేసులో తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారు అయిన మహిళ నుండి రూ.5000 లంచం తీసుకుంటూ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ ఏలూరు డీఎస్పీ వి గోపాలకృష్ణ కథనం ప్రకారం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన మడతల నాగమణికి అదే గ్రామానికి చెందిన ప్రత్తిపాటి వెంకట్రావుతో విభేదాలున్నాయి. వారిరువురూ కోర్టును కూడా ఆశ్రయించారు. గత మూడు సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.

పడవ ప్రమాదాల నివారణకు చర్యలు

విజయవాడ, జనవరి 18: కృష్ణా, గోదావరి నదులను దాటేందుకు ప్రమాద రహిత బోట్లను సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో పడవ ప్రమాదాల నివారణ చర్యలపై సీఎస్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన మూడు సంవత్సరాల్లో 67 మంది పడవ ప్రమాదాల్లో చనిపోయారన్నారు. ఇకపై ఈ ప్రమాదాలు జరుగకుండా రక్షణ ఉన్న అధునాతన బోట్లను కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పడవలకు లైసెన్సుల జారీ, శిక్షణ తీసుకున్న చోదకుల నియామకం వంటి చర్యల ద్వారా ప్రమాదాలను చాలా వరకూ తగ్గించవచ్చన్నారు.

పందులు,కుక్కల దాడిలో శిశువు మృతి

నెల్లిమర్ల, జనవరి 18: విజయనగరం జిల్లా నెల్లిమర్ల యాతవీధి ప్రాంతంలో శుక్రవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన ఆడ శిశువుని వీధి శివార్లలో గుర్తు తెలియని మాతృమూర్తి విడిచిపెట్టింది. స్థానికుల వివరాల మేరకు రామతీర్థం జంక్షన్ శ్రీనివాస థియేటర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు, పందులు విచక్షణా రహితంగా పీక్కుతినడాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు రోదన విన్న స్థానికులు అక్కడికి వెళ్లి ఆ పందులను, కుక్కలను వెళ్ళగొట్టారు. శిశువు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

ఓఎన్జీసీలో యంత్ర పరికరం అపహరణ

రాజమహేంద్రవరం, జనవరి 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో యంత్ర పరికరం అపహరణకు గురైన ఉదంతం శుక్రవారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అపహరణకు గురైన పరికరాల విలువ సుమారు రూ.100 కోట్లని, ప్రమాదకరమైన రేడియోధార్మిక ప్రభావాన్ని చూపేవని ఓ ఛానల్‌లో ప్రచారం జరగడమే ఈ కలకలానికి కారణం. అయితే ఈ విషయాన్ని ఓఎన్జీసీ వర్గాలు ఖండించాయి. పోయినది చమురు, గ్యాస్ అనే్వషణలో ఉపయోగించే యంత్ర పరికరమని ఓఎన్జీసీ శుక్రవారం రాత్రి విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని 2013లో రూ.27 లక్షలకు కొనుగోలు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.

నన్నయ వర్సిటీలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు

రాజమహేంద్రవరం, జనవరి 18: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల కుస్తీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సహకారంతో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 16, 19 సంవత్సరాల కేటగిరిల్లో బాల బాలికలకు పోటీలు నిర్వహించారు. బాలురకు ఫ్రీస్టైల్, గ్రీక్ రోమన్ స్టైల్‌లో 10 వెయిటేజీ కేటగిరిల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

కోల్‌కతాకు చంద్రబాబు

అమరావతి, జనవరి 18: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో నిర్వహించే బీజేపీయేతర పార్టీల ర్యాలీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలోకోల్‌కతా బయల్దేరి వెళ్లారు. కోల్‌కతాలో శనివారం ర్యాలీలో పాల్గొనటంతో పాటు మరోవిడత జాతీయ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు..రాష్ట్రాల హక్కుల సాధన నేపథ్యంలో నిర్వహించే ర్యాలీ ఏపీతో పాటు దేశ ప్రజలకు ఓ సంకేతాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ స్నేహం...!

కర్నూలు, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌తో వైకాపా అధినేత జగన్ స్నేహం అంశం ప్రస్తుతం రాయలసీమలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మైత్రి ఓట్ల పంట పండిస్తుందా అన్న చర్చ జోరందుకుంది. అయితే కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రులను అసభ్య పదజాలంతో దూషించిన కేసీఆర్‌ను సీమ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలవకుండా అడ్డుకున్నారన్న కారణంగా రాయలసీమలోనూ కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు ఉన్నాయని విశే్లషకులు వెల్లడిస్తున్నారు.

Pages