S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహాయక చర్యలు వేగవంతం

హైదరాబాద్, డిసెంబర్ 9: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు. ఢిల్లీ నుంచే ఇక్కడి నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులను ముఖ్యమంత్రి ఫోన్లో అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. ఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేసి క్షతగాత్రులను ఆదుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనలో కూలీలు కొందరు మృతి చెందడం, మరి కొందరు తీవ్రంగా గాయపడటం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.

పాత నోట్లు ఇక తీసుకోం: ఆర్టీసి

హైదరాబాద్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి బస్సుల్లో గత నెల రోజులు అనుమతించారు. ఈ నెల 9వ తేదీ అర్ధ రాత్రి నుంచి పాత పెద్దనోట్లను అనుమతించమని టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు బస్సుల్లో, బస్‌పాస్ కౌంటర్ల వద్ద పాత నోట్లు చెల్లుబాటు అయ్యేవని, కానీ, శనివారం వేకువజాము నుంచి టిఎస్‌ఆర్‌టిసిలో పాత నోట్లు అనుమతించబడవని ఆయన తెలిపారు. ప్రయాణికులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఎండి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

సుధీర్‌బాబుకు 23వరకు రిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 9: పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబును సిబిఐ అధికారులు శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. ఈనెల 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్ట్ఫాసుల్లో సుధీర్‌బాబు ఆదేశాలతో రూ. 3కోట్ల పెద్దనోట్లు మార్చినట్లు సిబిఐ మూడు కేసులు నమోదు చేసింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన నితిన్, నర్సింహారెడ్డి అనే వ్యక్తులను అరెస్టు చేశారు.

‘సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ తెరిపించండి’

హైదరాబాద్, డిసెంబర్ 9: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 54 రోజులకు చేరిందని తెలిపారు. తాను నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించగానే సారంగాపూర్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు ఫ్యాక్టరీకిని తెరిపించాలని కోరుతూ వినతి పత్రాలు పట్టుకుని ఎదురు వచ్చారని ఆయన వివరించారు.

జగన్ మహాధర్నా సక్సెస్

ఒంగోలు,డిసెంబర్ 9:జిల్లాకేంద్రమైన ఒంగోలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకు నిరసనగా మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. వ్యాప్తంగా మహాధర్నాలు జరుగుతుండగా ఒంగోలులో జరిగిన ధర్నాకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. జగన్ హాజరుకానున్న నేపధ్యంలో జిల్లాలోని 12నియోజకవర్గాల నుండి వైకాపాముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

వివిధ బ్యాంకుల నుండి నకిలీ బంగారం పెట్టి రూ.15కోట్లు స్వాహా

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 9: నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి బ్యాంక్ నుండి రూ.ఐదు కోట్లు కాజేసిన కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతుంది. ఇందుకు సంబంధించి 12మందిని ఎమ్‌విపిజోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

నేటి నుండి మూడురోజులు బ్యాంకులకు సెలవు

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుప్రభావంతో గడిచిన నెలరోజులు నుండి నగదు కోసం ప్రజలు బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు చుట్టూ తిరిగినప్పటికే సమయం సరిపోతుంది. తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసారు. అనంతరం తిరిగి నగదు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు విదించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బ్యాంకులు నుండి వారానికి 24వేలు డ్రా చేసుకోవచ్చని ఉన్నప్పటికీ నగదు కొరత కారణంగా కొన్ని బ్యాంకుల్లో నాలుగువేలు, మరిరొన్ని బ్యాంకుల్లో పదివేలు మించి ఇవ్వకపోవడంతో ప్రజలు ప్రతీరోజు నగదు కోసం బ్యాంకులు వద్ద పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉంది.

‘రోగులకు మెరుగైన వైద్యం అందజేయాలి’

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: ఎన్టీఆర్ వైద్యాలయానికి గ్రామీణ ప్రాంతాలనుండి అనేక వ్యాధులతో బాధపడుతూ వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మందులు అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎన్టీఆర్ వైద్యాలయం సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఎన్టీఆర్ వైద్యాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగిని అన్నిరకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది చొరవ చూపాలన్నారు.

మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత

నర్సీపట్నం, డిసెంబర్ 9: విశాఖ మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం లంబసింగిలో ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం ఏడు డిగ్రీలు నమోదైంది. చింతపల్లిలో గురువారం 7.5 డిగ్రీలు, శుక్రవారం 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ వలన ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు పొగ మంచు కురుస్తుండడం గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

హెల్త్ అసిస్టెంట్ల నిరసన ప్రదర్శన

పాడేరు, డిసెంబర్ 9: తమ సమస్యను పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్ష చేపడుతున్న కంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు శుక్రవారం పాడేరు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విధుల్లో నుంచి తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వీరు ఆందోళన చేపడుతున్నారు. ఎపిడమిక్ సీజన్‌లో తమ సేవలను వినియోగించుకున్న అధికారులు ప్రస్తుతం తమను విధుల నుంచి తొలగించి అన్యాయం చేసారని వారు వాపోతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ర్యాలీలో నినాదాలు చేసారు.

Pages