S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

మంచిర్యాల, జూలై 3: ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఎఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ, గోపాల్‌వాడల్లోని వార్డుల్లో పర్యటిస్తూ వార్డు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఎలాంటి సమస్యలున్నా, అభ్యంతరాలున్నా స్వచ్ఛందంగా వచ్చి జనమైత్రి అధికారి ద్వారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, మీ కాలనీల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. పేద పిల్లలకు స్కూల్‌బ్యాగ్స్, మహిళలకు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.

రాష్ట్భ్రావృద్ధికి భారీగా కేంద్రం నిధులు

ఆదిలాబాద్, జూలై 3: కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్రం కుంటిసాకులుచూపి కేంద్రంపై నిందలు మోపడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయ్యనగారి భూమయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని బిసి భవనంలో మండల బిజెపి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. 2019 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా ప్రతి ఒక్క లబ్దిదారునికి అందేలా చూడాలన్నారు.

సంధ్య హంతకుడిని ఉరి తీయాలి

మంచిర్యాల అర్బన్, జూలై 3: శనివారం బైంసాలో యువతి సంధ్యపై జరిగిన పైశాచిక దాడులను ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తోందని నాయకురాలు జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశంలో మహిళలను పట్టపగలు హత్య చేయడమంటే ఈ ప్రజాస్వామ్య దేశమా లేక ఉన్మాదుల దేశమా అని ఆశ్చర్యపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్భయ చట్టం వచ్చినప్పటికీ స్ర్తిలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. శనివారం బైంసా పట్టణంలో సంద్యపై పైశాచిక దాడికి దిగిన వ్యక్తిని ఉరి తీయాలని, ఇక ముందు ఇలాంటి దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

ఆదిలాబాద్ మార్కెట్ పీఠంపై వీడని చిక్కుముడి

ఆదిలాబాద్, జూలై 3: జిల్లాలో ఊరిస్తూ వచ్చిన మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. జిల్లాలోని 17 మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు రిజర్వేషన్లను ప్రకటించగా ఇప్పటికే పది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియమాకాలకు ఎమ్మెల్యేలు పూర్తి ప్రతిపాదనలు నివేదించగా, ప్రభుత్వం చైర్మన్ పదవులను ఎమ్మెల్యే సూచించిన నేతలకు ఖరారు చేసింది. అయితే జిల్లాలోని మూడు నోటిఫైడ్ మార్కెట్ కమిటీ స్థానాల్లో చైర్మన్ పదవులను ఎస్టీలకే రిజర్వ్ చేయాలని డిమాండ్ తెరపైకి రావడంతో ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.

కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం

భైంసా రూరల్, జూలై 3: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి కార్యకర్తలందరూ కృషిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఉమ్మడి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని దారాబ్ది జిన్నింగ్ ఫ్యాక్టరీలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అధ్యక్షతన జరిగిన ముధోల్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

అంతా అనుకున్నట్లే..

ఖమ్మం, జూలై 3: అంతా ఊహిస్తున్నట్లుగానే, పోరాటాలకు సంబంధం లేకుండానే జిల్లాల విభజనపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తుది నివేదికను అందించనున్నారు. జిల్లా కేంద్రాల కోసం అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నా, ఒకే నియోజకవర్గంలోని మండలాలు వివిధ జిల్లాల పరిధిలోకి వెళ్తున్నా, అవేవి ప్రజా సౌలభ్యం కోసం కాదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసినట్లుగానే విభజన ప్రక్రియ చివరి దశకు చేరింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా 41 మండలాల పరిధిలో ఉండగా మరో 7 కొత్త మండలాలను ఏర్పాటు చేయనున్నారు.

చిరుత సంచారం?

ఖానాపురం హవేలి, జూలై 3: చిరుత సంచరిస్తుందనే అనుమానంతో రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటాయపాలెం గ్రామస్థులు ఆదివారం తీవ్ర ఆందోళన చెందారు. గతం వారం రోజులుగా సమీపంలోని పొలాల నుంచి ఓ జంతువు(చిరుత పులి) సంచరిస్తుందనే గ్రామస్థుల్లో ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన శివకృష్ణ అనే వ్యక్తి అది గ్రామంలో నుంచి పొలాల్లోకి వెళ్తున్నట్లు గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు వచ్చే లోగా అది పొలాల్లో నుంచి సమీప మామిడితోటలోకి పారిపోయింది. ఈ క్రమంలో గ్రామస్థులు, అక్కడి నాయకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

నిలకడగా వరద గోదారి

భద్రాచలం, జూలై 3: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.4అడుగులకు చేరుకుని ఆదివారం సాయంత్రం నాటికి నిలకడగా కనిపిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ఉపనదులు తాలిపేరు, ప్రాణహిత, ఇంద్రావతి సమీపంలోనూ విస్తారంగా వానలు తోడై శనివారం నాటికి నీటిమట్టం 20 అడుగులకు పెరిగింది. శనివారం అర్థరాత్రి దాటాక వేగం పెరిగి సుమారు గంటకు అడుగు చొప్పున నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంత అధికారులను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. అదివారం మధ్యాహ్నం నాటికి 28.4 అడుగుల వద్దకు వరద నీటి మట్టం చేరుకుని నిలకడగా మారిందని భద్రాచలం కేంద్ర జలవనరుల సంఘం అధికారులు వెల్లడించారు.

చిరుతపులుల మృతిపై డిఎఫ్‌వో విచారణ

చండ్రుగొండ, జూలై 3: మండల పరిధిలోని అబ్బుగూడెం అడవుల్లో రెండు చిరుతపులులను హతమార్చిన సంఘటనపై కొత్తగూడెం డిఎఫ్‌ఓ శాంతారామ్ ఆదివారం విచారణ చేపట్టారు. అబ్బుగూడెం అడవులలో రెండు చిరుతపులులను హతమార్చిన విషయాన్ని శనివారం రాత్రి ఆంధ్రభూమి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈకథనంపై స్పందించిన అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డిఎఫ్‌వో ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. చండ్రుగొండ పశువైద్యాధికారి రామ్‌ప్రసాద్‌తో పులుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పంచనామా సమయంలో పులుల కాళ్ళను నరికిన ఆనవాళ్లు కనిపించాయి.

విషప్రయోగంతోనే చిరుతల హతం

కొత్తగూడెం, జూలై 3: చండ్రుగొండ మండలంలోని అబ్బుగూడెం అటవీప్రాంతంలో రెండు చిరుతల మృతికి విషప్రయోగమే కారణమని జిల్లా కన్జర్వేటర్ డాక్టర్ జి నర్సయ్య తెలిపారు. స్థానిక డిఎఫ్‌ఓ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరుతలు మృతిచెంది దాదాపు నాలుగురోజులు గడిచి ఉంటుందన్నారు. చిరుతల మృతదేహాలపై చర్మం లేచిపోవడాన్ని బట్టి ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రెండు ఆడ చిరుతలేనన్నారు. ఒకదాని వయస్సు 5 నుండి 6సంవత్సరాలు, మరొకదాని వయస్సు సంవత్సరం న్నర నుండి 2సంవత్సరాలు ఉంటుందని అన్నారు.

Pages