S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితులు, గిరిజనులు కమిషన్‌కు రెండుకళ్లు

చంద్రగిరి, సెప్టెంబర్ 19: దళితులు, గిరిజనులు కమిషన్‌కు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి అన్నారు. సోమవారం జిల్లా దళిత గిరిజన వేదిక ఆధ్వర్యంలో చంద్రగిరి మండలంలో రాములవారి ఆలయ ఆవరణలో ఆయనకు పౌరసన్మానం చేశారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ ప్రసంగించారు. దళిత విద్యార్థులు విదేశీయ విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్ ద్వారా చంద్రన్న బాట కింద దళిత గిరిజన కాలనీలో సీసీ రోడ్లునిర్మాణ పనులను పూర్తిచేస్తున్నామన్నారు.

కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించిన టిటిడి చైర్మన్

తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ భవనాన్ని టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం ప్రారంభించారు. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీకి అవసరమైన వస్తువులను సీజన్‌లోతక్కువ ధరకు కొనుగోలుచేసి నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఈ కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించామన్నారు. 55 టన్నుల వరకు ఈ భవనంలో వస్తువులను నిల్వ ఉంచుకోవచ్చన్నారు. 1కోటి రూపాయల వ్యయంతో 2,454 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండతస్థుల భవనాన్ని నిర్మించామన్నారు. భవిష్యత్‌లో మరోరెండు ఫ్లోర్‌లను నిర్మిస్తామన్నారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

తిరుపతి, సెప్టెంబర్ 19: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ వి సురేష్‌బాబు అన్నారు. సోమవారం సిఎల్‌ఆర్‌సి భవనంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల అంచనాలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మధ్య తేడా అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ కన్సల్టెంట్స్ బృందం పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక కౌనె్సలింగ్ నిర్వహించామన్నారు.

క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించండి : కలెక్టర్

తిరుపతి, సెప్టెంబర్ 19: రెజ్లింగ్, చెస్ క్రీడల్లో జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన బాల బాలికలను జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అభినందించారు. సోమవారం స్థానిక పద్మావతి అతిథి భవనంలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిఇఓ, ఫిజికల్ డైరెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ నాగేశ్వరరావు, పి.డి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

టిటిడి స్థానిక ఆలయాలు, విద్యాసంస్థల్లో జలప్రసాదం

తిరుపతి, సెప్టెంబర్ 19: టిటిడిలోని స్థానిక ఆలయాలు, విద్యాసంస్థల్లో జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేయాలని టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఇఓ కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమలలో రాగి డాలర్లను భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెండి, బంగారు డాలర్లను బుధవారం నుంచి మంగళవారం వరకు వారంరోజుల పాటు ఒకే ధర ఉండేలా స్థిరీకరించాలని సూచించారు.

యుపి ఎన్నికలతో తేలనున్న మోదీ భవిష్యత్తు

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 19: త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ అభిప్రాయపడ్డారు. సోమవారం తొట్టంబేడు మండల కార్యాలయానికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలో రాజకీయంగా పెద్ద మార్పులు జరుగుతాయని చెప్పారు. నరేంద్రమోదీ గుజరాత్‌పై కాకుండా ఉత్తరప్రదేశ్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని, ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఆయన భవిష్యత్తును తేలుస్తాయన్నారు. అవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

శ్రీవారి సేవలో పుష్పగిరి పీఠాధిపతి

తిరుమల, సెప్టెంబర్ 19: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిజీ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శన సమయానికి ముందు ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టిటిడి అధికారులు, అర్చకులు మహాద్వారం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పీఠాధిపతికి ఆలయ అధికారులు పట్టువస్త్రం, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

‘ఆదర్శ పాఠశాల వద్ద బస్సులు ఆపాలి’

బైరెడ్డిపల్లె, సెప్టెంబర్ 19: మండలంలోని కమ్మనపల్లి వద్ద గల ఆదర్శ పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ పాఠశాలలో ఇంటర్ విద్య వరకు అవకాశం ఉన్నది. మండలంలోని వివిధ గ్రామాల నుండి రోజు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు నిలుపక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటి చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాద్రోహులు చంద్రబాబు, వెంకయ్యనాయుడు

ఐరాల, సెప్టెంబర్ 19: తమ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ద్రోహులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు అని నగరి శాసనసభ్యులు రోజా విమర్శించారు. సోమవారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకొని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో అధిష్టానంలోకి మిత్ర పక్షమైన బిజెపిని ఒప్పించి ప్రత్యేకహోదా తీసుకువస్తామని ప్రజలను యామార్చారన్నారు.

స్కూల్ రుణం తీర్చుకుంటా పథకం

రాజంపేట, సెప్టెంబర్ 19: స్కూల్ రుణం తీర్చుకుంటా పథకాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నట్లు మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యారంగాన్ని అభివృద్ధి దిశగా ముందుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప జిల్లా రాజంపేటలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ప్రస్తుతం ఉన్నత స్థానానికి చేరుకున్నవారిని గతంలో వారు చదివిన స్కూల్ అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకానికి మంచి స్పందన లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

Pages